భోజ్‌శాల హిందువులదే.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు

  • ముస్లింల శుక్రవారం నమాజ్‌ హక్కు రద్దు
  • మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సూచన
  • లండన్‌ నుంచి విగ్రహం తీసుకురావాలని ఆదేశం
  • ఏఎస్‌ఐ సర్వే ఆధారంగా తీర్పు
మధ్యప్రదేశ్‌లో ధార్‌ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌పై అక్కడి హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ వివాదాస్పద కట్టడం సరస్వతీ దేవి ఆలయమేనని స్పష్టం చేసింది. ముస్లింలు అక్కడ ప్రతి శుక్రవారం నమాజ్‌ చేసుకోవడానికి అనుమతిస్తూ 2003లో పురావస్తు శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా రద్దు చేసింది.

ఇకపై భోజ్‌శాల ప్రాంగణంలో మతపరమైన పూజలు చేసుకునే పూర్తి హక్కు హిందువులకే ఉంటుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ముస్లిం సమాజం నమాజ్‌ చేసుకోవడానికి వీలుగా ఈ జిల్లాలోనే వేరే చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కట్టడం పరమార వంశానికి చెందిన రాజా భోజుడు నిర్మించిన సంస్కృత విద్యా కేంద్రమని స్పష్టం చేసింది.

లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్న పురాతన సరస్వతీ దేవి విగ్రహాన్ని తిరిగి భారత్‌కు రప్పించేందుకు అధికారిక ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. క్రీస్తుశకం 1010 నుంచి 1055 మధ్యకాలంలో రాజా భోజుడు ఈ ప్రసిద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.

గతంలో కోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ ఈ కాంప్లెక్స్‌లో 98 రోజుల పాటు సుదీర్ఘ శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఆలయాన్ని సూచించే భాగాలను ఉపయోగించే ఇక్కడున్న నిర్మాణాన్ని చేపట్టారని ఏఎస్‌ఐ తన రెండు వేల పేజీల నివేదికలో పేర్కొంది. సర్వేలో దొరికిన నాణేలు, శిల్పాలు, శాసనాలు ఇది హిందూ దేవాలయమేనని నిరూపిస్తున్నాయన్న హిందూ పక్షం వాదనతో కోర్టు ఏకీభవించింది.

Bhojshala
Bhojshala Temple
Madhya Pradesh High Court
Saraswati Devi
Raja Bhoj
Dhar district
Archaeological Survey of India
ASI report
Hindu worship
British Museum

More Telugu News